Thursday, September 25, 2014

ఐఫోన్ 6లో ఏమున్నాయి?

చుక్కల్లో చంద్రుడు ఎలాగో స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ అలా అనడం అతిశయోక్తి కాదేమో. అందుకే కొత్త మోడల్ ఐఫోన్ విడుదలైన ప్రతిసారి సందడి సందడిగా ఉంటుంది. కొత్త కొత్త రికార్డులు పుట్టుకొస్తూంటాయి. తాజాగా ఐఫోన్ 6, 6 ప్లస్, ఐఓఎస్ 8లు కూడా దీనికి భిన్నమేమీ కాదు. విడుదలైన తరువాత తొలి వారాంతంలో ఏకంగా కోటి ఐఫోన్లను విక్రయించి ఆపిల్ మరో రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ తాజా ఐఫోన్లలో ఉన్న విశేషాలేమిటి? అర లక్ష పోసి కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి?

ముందుగా ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 8 గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఆపిల్ అభిమానులు ఈ కొత్త ఓఎస్‌ను చూసి పెదవి విరిచేశారు. అయితే కొంచెం తరచి చూస్తేగానీ దీంట్లోని కొత్త ఫీచర్లేమిటన్నది స్పష్టం కాదు. ఉదాహరణకు... పాతతరం ఐఫోన్లలో ఈమెయిల్ మల్టీటాస్కింగ్ సౌకర్యం అస్సలు లేదు. స్క్రీన్‌పై ఉన్న మెయిల్‌ను క్లోజ్ చేస్తేగానీ రెండోదాన్ని ఓపెన్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఐఫోన్ 6లో ఈ ఇబ్బంది లేదు. మెయిల్‌ను ఒకసారి కిందివైపు స్వైప్ చేస్తే చాలు... నేరుగా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లవచ్చు. దీంతోపాటు మెయిళ్లను ట్యాబ్‌ల మాదిరిగా ఓపెన్ చేసి బ్రౌజ్ చేయవచ్చు కూడా.

థర్డ్ పార్టీ కీబోర్డు

ఆపిల్ ఉత్పత్తులు అన్నింటిలో ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లనే వాడుతూంటారు. ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునే అవకాశం దాదాపుగా ఉండదు. తాజ ఐఫోన్ దీనికి మినహాయింపు. ప్రత్యేకంగా రూపొందించిన ఐఫోన్ కీబోర్డు స్థానంలో ఇతర కంపెనీల కీబోర్డులు కూడా వాడుకునేందుకు దీంట్లో అవకాశం కల్పించారు.సెట్టింగ్స్‌లోని జనరల్ ట్యాబ్‌లో ఉండే కీబోర్డు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కీబోర్డును ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే కొత్త కీబోర్డుతో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ పనిచేయదు. టచ్ ఐడీ ఫీచర్‌లోనూ ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునేందుకు అవకాశం కల్పించడం మరో విశేషం.

నోటిఫికేషన్లతో గమ్మత్తులు..

కొత్త మెసేజీలు, అలర్ట్‌ల వివరాలు తెలుసుకునేందకు పనికొచ్చే నోటిఫికేషన్ ఏరియా ఇప్పుడు గమ్మత్తులకు కేంద్రమైంది. ఆయా నోటిఫికేషన్లు ఎక్కడి నుంచి (మెసేజ్, వాట్స్ యాప్, మెయిల్ వంటివి) వచ్చినప్పటికీ ఆయా అప్లికేషన్లలోకి వెళ్లే అవసరం లేకుండా నేరుగా వాటికి సమాధానమివ్వడం, డిలీట్ చేయడం, అలారం వంటి వాటిని ఆఫ్ చేయడం చేసేయవచ్చు. వీటితోపాటు వాయిస్ అసిస్టెంట్ సిరిలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి.

ఐఫోన్ బ్యాటరీ వినియోగంపై ఒక కన్నేసి ఉంచేందుకు ఏర్పాట్లు ఉండటం ఐఫోన్ 6లో కనిపించే ప్రత్యేకమైన ఫీచర్. దీన్ని ఉపయోగించుకునేందుకు సెట్టింగ్స్‌లోని జనరల్ ఆప్షన్‌లోకి వెళ్లండి. యూసేజ్, బ్యాటరీ అని ఉన్న చోట ట్యాప్‌చేస్తే ఏఏ అప్లికేషన్లు ఎంత మేరకు బ్యాటరీని వాడుతున్నాయో తెలుస్తుంది. అంతేకాదు... ఆయా అప్లికేషన్లు ఎందుకు అంత మేరకు బ్యాటరీని ఉపయోగించాయో కూడా వివరించడం (సిగ్నల్ సామర్థ్యం తక్కువగా ఉందని... చాలాసమయం పాటు ఆన్‌లో ఉన్నట్లు... ) విశేషం.

Friday, September 12, 2014

యాపిల్ వాచ్ వచ్చేసింది...

యాపిల్ కొత్త ఉత్పత్తుల రాక కోసం యావత్ టెక్నాలజీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్థరాత్రి టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు తమ మొట్ట మొదటి స్మార్ట్‌వాచ్ యాపిల్ వాచ్‌ను ప్రపంచనాకి పరిచయం చేసింది.
 
యాపిల్ వాచ్ ఐఓఎస్ 8 ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల విడదలైన మోటరోలా మోటో 360, సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్‌లకు ఈ యాపిల్ డివైజ్ పోటీగా నిలవనుంది. యాపిల్ ఈ విప్లవాత్మక స్మార్ట్‌వాచ్‌ను 2015లో అన్ని ప్రముఖ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యాపిల్ వాచ్ ధర 349 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.20,940) ఉండొచ్చని ఓ అంచనా. యాపిల్ వాచ్, తాజాగా విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. 
 
వాటి వివరాలు.. 
యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్. యాపిల్ వాచ్ ఎడిషన్ వేరియంట్‌ను 18 క్యారట్ బంగారంతో డిజైన్ చేసినట్లు కంపెనీ సిఈఓ టిమ్ కుక్ తెలిపారు. మరో వేరియంట్ యాపిల్ వాచ్ వివిధ మోడళ్ల లెదర్, మెటల్ ఇంకా స్పోర్ట్ బ్యాండ్ ఆప్షన్‌లతో కలుపుకుని మొత్తం 18 మోడళ్లలో అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ స్పోర్ట్స్ వేరియంట్ 10 మోడళ్లలో లభ్యంకానుంది. 
 
యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసారు. ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్ ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది. వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు. వినియోగదారుడి ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్ కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

Wednesday, September 10, 2014

ఐఫోన్ 6 వచ్చేసింది...

ఐఫోన్ 6 వచ్చేసింది...


 యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను మంగళవారం అర్ధరాత్రి(భారత కాల మానం ప్రకారం)ఆవిష్కరించింది. వీటితో పాటు ఐవాచ్‌ను కూడా కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, ఈ నెల 19 నుంచి డెలివరీలు ప్రా రంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రెండు ఫోన్లను ఏ8 చిప్‌తో యాపిల్ కంపెనీ రూపొందించింది.

ఇంతకు ముందటి ఐఫోన్‌లలోని చిప్‌లతో పోల్చితే ఇది 25% అధిక వేగంగానూ, 50 శాతం మెరుగ్గానూ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 6లో 4.7 అంగుళాల డిస్‌ప్లే, 6.9 ఎంఎం మందం,    8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 14 గంటల టాక్‌టైమ్, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్‌బై, 4జీని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16 జీబీ మోడల్ 199 డాలర్లు, 299 డాలర్లు(64 జీబీ), 399 డాలర్లు(128 జీబీ).

అమెరికాలో టెల్కోల కాంట్రాక్టుతో ధరలివి.ఇక ఐఫోన్ 6ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్, 7.1 ఎంఎం మందం, రెటీనా డిస్‌ప్లే హెచ్‌డీ, 16 గంటల స్టాండ్‌బై టైమ్, 14 గంటల వీడియో ప్లేబ్యాక్,  8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.  ధరలు 16 జీబీ మోడల్ 299 డాలర్లు, 399 డాలర్లు(64 జీబీ),499 డాలర్లు(128 జీబీ).

Thursday, September 4, 2014

బ్యాటరీ మన్నికకు కొత్త ఆప్...

బ్యాటరీ మన్నికకు కొత్త ఆప్...

బ్యాటరీ ఛార్జింగ్‌ను ఎక్కువకాలం పనిచేయించేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ బ్యాటరీ మరింత ఎక్కువ కాలం మన్నేలా చేయలేవు. కానీ పర్డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఛార్లీ హూ అభివృద్ధి చేసిన ఎస్టార్  అప్లికేషన్ మాత్రం బ్యాటరీ జీవితకాలాన్ని కూడా పెంచుతుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న, లేదా చేసుకోబోతున్న అప్లికేషన్లు ఎంత మేరకు విద్యుత్తు ఖర్చు చేస్తాయో ఎప్పటికప్పుడు లెక్కకట్టి మీకు తెలియజేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంటున్నారు ఛార్లీ. ఈ సమాచారం ఆధారంగా మీరు ఎక్కువ విద్యుత్తును వాడుకునే అప్లికేషన్లను తొలగించుకోవచ్చు. ఎస్టార్ సూచించే పొదుపైన ఆప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్తును ఆదా చేసి, బ్యాటరీ ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చునన్నమాట. ఇవన్నీ చేస్తే బ్యాటరీ జీవితకాలం కూడా పెరిగిపోతుందన్నది తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఎస్టార్‌లో ఫైవ్‌స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను పోలిన కోడింగ్ ఉంటుంది.

 ఆన్‌లైన్ మ్యూజిక్, రేడియో కోసం వింక్స్..

 ప్రముఖ సెల్‌ఫోన్ క్యారియర్ సంస్థ ఎయిర్‌టెల్ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టింది. వింక్స్ పేరుతో ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఐఫోన్లలో ఈ అప్ ద్వారా సంగీతాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ కనెక్షన్ లేకున్నా ఉచితంగా పాటలను వినే అవకాశం ఉండటం విశేషం. ఈ సర్వీసులో దాదాపు ఎనిమిది భాషలకు సంబంధించిన 17 లక్షల పాటలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. వినే పాటల్ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారికి ప్రస్తుతం రెండు రకాల సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. వింక్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.99 కాగా, వింక్ ఫ్రీడమ్ ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఆర్టిస్ట్, మూడ్స్, జెనెర్ విభాగాల్లో లభ్యమయ్యే పాటలను 32, 64, 128 కేబీపీఎస్ నాణ్యత ప్రమాణాల్లో వినే అవకాశం ఉంది.

Thursday, August 28, 2014

భలే ఆప్స్

చేయి తడితే క్లిక్ క్లిక్ క్లిక్!

ఈ రోజుల్లో సెల్ఫీలదే హవా. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీలే సెల్ఫీలు. కానీ గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే? అందంగా పోజిచ్చిన తరువాత క్లిక్ మనిపించాలంటే? ఇంకొకరి సాయం కావాలా? ఊహూ అవసరం లేదంటోంది స్నాప్ క్లాప్ అప్లికేషన్. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ కెమెరాతో ఎన్నో ట్రిక్కులు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టడమే. సెల్ఫీల్లా ఫ్రంట్ కెమెరాతో మాత్రమే కాకుండా ఎక్కువ రెజల్యూషన్ ఉండే ప్రధాన కెమెరాతోనూ ఫొటోలు తీసుకోవచ్చు. ఫొటోకు అవసరమైన లైటింగ్ సరిగా లేకపోతే ఈ అప్లికేషన్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఫొటోల ఎడిటింగ్, మిత్రులతో షేరింగ్ వంటివి అదనపు ఫీచర్లు!

ఇన్‌స్టాబ్రిడ్జ్‌తో ఫ్రీ వైఫై


వీధి వెంబడి వెళుతూంటే ‘‘వైఫై నెట్‌వర్క్ అవైలబుల్’ అన్న నోటిఫికేషన్లు తరచూ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతూంటాయి. ఈ నెట్‌వర్క్‌లలో కొన్ని ఉచితంగానూ లభించవచ్చు. కానీ ఆ నెట్‌వర్క్‌లేవో తెలియకపోవడం వల్ల మనం వాటిని ఉపయోగించుకోలేము. ఇన్‌స్టా బ్రిడ్జ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ కొరత తీరిపోతుంది. ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించడంతోపాటు ఆయా నెట్‌వర్క్‌ల స్పీడ్‌ను లెక్కకట్టేందుకు, డేటా యూసేజ్‌ను తెలుసుకునేందుకు కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పాస్‌వర్డ్ పంచుకోకుండానే వైఫై నెట్‌వర్క్‌ను ఇతరులతో షేర్ చేసుకునేందుకు దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. అన్ని కనెక్షన్లకూ క్లౌడ్ బ్యాకప్ ఉండటం మరో విశేషం. ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లలో సక్రమంగా పనిచేయని వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని వదిలించుకోవచ్చు కూడా.

బుడతల ఐడియాలకు రూపమిచ్చే ‘మై ఇండియా’

దేశంలోని అనేక సమస్యలపై పిల్లల్లోనూ అవగాహన పెంపొందించేందుకు, వాటిపై తమతమ ఆలోచనలను ఇతరులతో పంచుకునేందుకు బోధ్‌గురు అనే సంస్థ వినూత్నమైన మొబైల్ అప్లికేషన్లను విడుదల చేసింది. భారత 68వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ అప్లికేషన్లతో చిన్నారులు తమ ఆలోచనలను ఆడియో, వీడియోలతో ఒక పుస్తక రూపంలోకి తీసుకురావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మైగవ్ వెబ్‌సైట్ స్ఫూర్తితో తాము ఈ అప్లికేషన్లను అభివృద్ధి చేశామని నాలుగేళ్లు మొదలుకొని 18 ఏళ్ల యువకుల వరకూ ఎవరైనా ఈ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చునని కంపెనీ తెలిపింది. పారిశుద్ధ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ ఇండియా వంటి అంశాలపై పిల్లలు చిన్న చిన్న కథలు, ఐడియా బుక్‌ల రూపంలో తమ ఆలోచనలను పొందుపరచవచ్చు. ఈ డిజిటల్ ఐడియా బుక్‌ల రూపకల్పనకు కావాల్సిన అంశాలన్నింటినీ అప్లికేషన్‌లో పొందుపరిచామని కంపెనీ డెరైక్టర్ సమీర్ జైన్ తెలిపారు.

Tuesday, August 26, 2014

10 ఉచిత ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్‌లు



డిజిటల్ ఇంకా డీఎస్ఎల్‌ఆర్ కెమెరాలతో సాధ్యమయ్యే ఫోటోగ్రఫీని నేటితరం స్మార్ట్‌ఫోన్‌లు సాకారం చేస్తున్నాయి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల ఆప్షన్‌లతో మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ ఫోటోగ్రఫీతో పాటు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని చేరువ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని మెరుగులద్దుకునే క్రమంలో అనేక ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో లభ్యమవుతున్న 10 ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు


  1. VSCO Cam (iPhone, Android)
  2. Snapseed        
  3.  Adobe Lightroom (iPad)
  4. Instagram (iPhone, Android, Windows Phone)
  5. Pixlr Express (Android, iOS)
  6. Flickr (iPhone, Android, Windows Phone)
  7. Photo Editor by Aviary (Android, iOS, Windows Phone)
  8. Repix (Android, iOS)
  9. Litely (Android, iOS)
  10. Photo Studio (BlackBerry 10, Android)

Monday, August 25, 2014

స్పైస్ ఫైర్‌ఫాక్స్ ఫోన్@రూ.2,299

మొజిల్లా సంస్థ భాగస్వామ్యంతో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్పైస్ మొబిలిటీ, ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 పేరుతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ కాన్ఫిగరేషన్, 3.5 అంగుళాల తాకే తెర, 1గిగాహెట్జ్ మొబైల్ ప్రాసెసర్ తదితర ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.2,299.

 
  • స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 (Spice Fire One Mi- FX1) కీలక ఫీచర్లు:
  • మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 
  • 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 320పిక్సల్స్), 
  • డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 
  • 1గిగాహెట్జ్ మొబైల్ ప్రాసెసర్, 
  • 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 
  • 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 
  • కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, వై-ఫై, బ్లూటూత్). 
 
ప్రస్తుతం స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 స్మార్ట్ ఫోన్ ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది.